గొల్లపల్లి, ఫిబ్రవరి 4 : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన కొక్కుల శ్వేత (30) జగిత్యాల డీసీఆర్బీలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో భాగంగా మంగళవారం తన ఇంటి నుంచి కారులో జగిత్యాలకు బయలుదేరారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఓ బ్యాంకులో ప్రైవేట్ ఉద్యోగిగా పని చేసే జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్ (26) సైతం విధులు నిర్వహించేందుకు బైక్పై బయలుదేరారు. చిల్వకోడూర్ శివారులోకి రాగానే కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కారు వేగంగా బైక్ను ఢీకొట్టడంతో నరేశ్ ఎగిరిపడి మృతిచెందినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శ్వేత గతంలో గొల్లపల్లి మండలంలో ప్రొహిబిషన్ ఎస్ఐగా, పెగడపల్లి, కోరుట్ల, వెల్గటూర్, కథలాపూర్లో ఎస్ఐగా పనిచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.