సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:46:03

గాంధీ వైద్యులకు వందనం!

గాంధీ వైద్యులకు వందనం!

  • డాక్టర్లు, సిబ్బందిపై కొవిడ్‌ బాధితుల ప్రశంసలు
  • డిశ్చార్జి సందర్భంగా సేవలపై అనందబాష్పాలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మాయదారి కరోనా మింగేస్తుందని భయం. ఊపిరి తీసుకోవడం ఎక్కడ ఆగిపోతుందననే ఆందోళన.  ఆపత్కాలంలో రోగులకు గాంధీ దవాఖాన జీవనజ్యోతిలా మారుతున్నది. ప్రాణా లు పోతాయనుకొని భయపడినవారు భవిష్యత్‌పై భరోసాతో ఇంటికెళ్తున్నారు. ఓ వైపు వైద్యులు, మరోవైపు సిబ్బంది కనిపించని శత్రువుపై అలుపెరుగని పోరాటంచేస్తూ ప్రా ణాలను నిలబెడుతున్నారు. అందుకే.. మహమ్మారి బారి నుంచి కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్న ప్రతిఒక్కరూ వైద్యసిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నారు. ‘డాక్టర్లే దేవుళ్లు.. దవాఖానే దేవాలయం’ అంటున్నారు.  

దవాఖాన మంచిగున్నది

మాది హిమాయత్‌నగర్‌. కరోనా బారిన పడ్డాక మొదట ఉస్మానియా దవాఖానలో చేర్పించారు. తర్వాత టీబీ హాస్పిటల్‌లో ఐదు రోజులు చికిత్స అందించారు. 10 రోజుల కిందట గాంధీకి తరలించారు. గాంధీలో వైద్యం చాలా బాగుంది. వైద్య సిబ్బంది ప్రతిక్షణం మమ్ములను జాగ్రత్తగా చూసుకున్నారు. దవాఖాన పరిశుభ్రంగా ఉన్నది. మంచి ఆహారం అందించారు. వారి కృషితో నేను పూర్తిగా కోలుకున్నా.

-మహ్మద్‌ నజీర్‌(38), హైదరాబాద్‌ 

గాంధీ అంటే భయపడ్డ

ఎర్రగడ్డ హాస్పిటల్‌ నుంచి ఫీవర్‌ దవాఖానకు పంపించా రు. అక్కడి డాక్టర్‌ నన్ను గాంధీకి పోతావా? అని అడిగారు. అంటే నేను భయపడ్డా. వెళ్లు నువ్వు మంచిగ అవుతావని చెప్పడంతో వచ్చా. అప్పటినుంచి నన్ను గాంధీ వైద్యులు, సిబ్బంది చాలా మంచిగ చూసుకుంటున్నారు. 22 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. భోజనం ఇవ్వడం, దుస్తులు మార్చడం అన్ని చేస్తున్నారు. 

-ప్రమీల, హైదరాబాద్‌ 


చికిత్స బాగుంది

ఎర్రగడ్డ ఛాతి దవాఖాన నుంచి వచ్చా. గాంధీలో చికిత్స బాగుంది. వైద్యులు అన్నీ చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. మాకు ధైర్యం చెప్తున్నారు. ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. గాంధీ దవాఖాన గురించి ఏవేవో కొందరు చెప్తున్నారు. కానీ, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ అన్ని బాగా చూసుకుంటున్నారు.

-ఉస్మాన్‌ఖాన్‌(35), హైదరాబాద్‌ logo