హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ప్రస్తుత పరిస్థితి, నీటి వినియోగం తదితర అంశాల అధ్యయనం కోసం సెంట్రల్ వా టర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి సీడబ్ల్యూపీఆర్ఎస్ లేఖ రాసింది. ఆర్డీఎస్ ద్వారా కేటాయింపుల మేర కు సాగు నీరు రావడం లేదని, ఆనకట్టల ఎత్తు పెంచడంతోపాటు ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ లు, కాలువల ఆధునికీకరణను చేపట్టాలని తెలంగాణ ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నది.
సుంకేశులకు నీరు రావడం లేదని ఏపీ సైతం ఫిర్యాదు చేస్తున్నది. దీంతో ఆర్డీఎస్పై సమగ్ర అధ్యయనానికి నిర్ణయించిన 16వ బోర్డు సమావేశం.. ఆ బాధ్యతను తీసుకోవాలని పు ణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు సంప్రదించింది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువలోకి 850 క్యూసెక్కుల డిశ్చార్జి కోసం చేయాల్సిన డిజైన్ మార్పుల గుర్తింపు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని మార్గదర్శకాలను నిర్దేశించింది. 17వ బోర్డు సమావేశంలో దీనిపై కేఆర్ఎంబీ చర్చించి.. క్షేత్రస్థాయిలో ఆర్డీఎస్ను సందర్శించి పూర్తి వ్యయ అంచనా నివేదిక అందించాలని కోరింది.