రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): అనారోగ్యం బారినపడి కస్తూర్బాగాంధీ హాస్టల్ విద్యార్థిని మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని చెప్పకుండా హాస్టల్ సిబ్బంది దసరా సెలవుల్లో ఇంటికి పంపించి చేతులు దులుపుకున్నారని విద్యార్థిని తండ్రి ఆరోపిస్తున్నారు. తన కూతురు చనిపోవడానికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ రంగారెడ్డి కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరుకు చెందిన కొంగర స్వాతి(17) శంషాబాద్ మండలం పాలమాకులలోని కేజీబీవీ బాలికల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. దసరా సెలవులకు ఇంటికి తీసుకెళ్లాలంటూ సెప్టెంబర్ 30న స్వాతి తండ్రి రమేశ్‌కు హాస్టల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అక్టోబర్ 1న స్వాతిని ఇంటికి తీసుకొచ్చారు.నీరసంతో ఉన్న స్వాతిని విషయం అడగగా..కొద్ది రోజులుగా ఇలాగే ఉంటోందని చెప్పింది. దీంతో షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా టైఫాయిడ్ వచ్చినట్టు వైద్యులు చెప్పగా మూడు రోజులు చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ కూడా జ్వరం నయం కాకపోవడంతో గాంధీ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే..బ్రెయిన్ డెడ్ అయి మరణించిందని వైద్యులు పేర్కొన్నారు. తన కూతురు మరణానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రమేశ్ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.