చంద్రబాబుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ లేఖ
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. విగ్రహ ఏర్పాటు కోసం అమరావతి కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీసీఆర్డీఏ) పరిధిలో స్థలాన్ని కేటాయించాలని కోరారు. తెలంగాణ కోసం జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ప్రాంతీయ సమానత్వం, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రజలకు మార్గదర్శనం చేశారని వివరించారు. ఆయన రచనలు, పరిశోధనలు, ప్రసంగాలతో దశాబ్దాలుగా ఉద్యమానికి ఊపిరి పోశారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ రూపకర్తగా, సిద్ధాంతకర్తగా పార్టీలకు అతీతంగా ఆయన సేవలు మరువలేనివని కీర్తించారు. భవిష్యత్ తరాలకు జయశంకర్ చేసిన సేవలు స్ఫూర్తి నింపుతాయని, ఏపీలో 10 ఫీట్ల విగ్రహ ఏర్పాటుకు వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.