నల్లగొండ, జనవరి 9 : నల్లగొండలోని డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (డ్వాబ్) ఆధ్వర్యంలో 26 ఏండ్లుగా అంధ విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్న అంధుల పాఠశాల మూసివేత దిశగా నడుస్తున్నది. దీంతో అంధ విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారు. అంధుల పాఠశాలను మూసి వేస్తే చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతారని, దాన్ని మూసి వేయవద్దని కోరుతూ ధర్నా చేశారు. పాఠశాలను మూసివేయవద్దని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పదో తరగతిలో 73 మంది విద్యార్థులు ఉండగా అందులో ఈ ఏడాది పదో తరగతి పూర్తి చేసుకొని 23 మంది వెళ్లనున్నారు. మరో 50 మంది విద్యార్థులు మాత్రమే ఉండనున్న నేపథ్యంలో సంఖ్య తక్కువగా కానుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో రాకపోవడం వల్ల ఆర్థిక భారం ఎక్కువై మూసివేస్తున్నట్లు డ్వాబ్ చైర్మన్ పొనుగోటి చొక్కారావు తెలిపారు.
అంధ పాఠశాల మూసివేతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణంగా తెలుస్తుంది. కేంద్రం ఇటీవల కొత్త నిబంధన తెచ్చింది. 60 శాతం నుంచి 100 శాతం వరకు అంధత్వం ఉంటేనే ఈ పాఠశాలలో ప్రవేశం కల్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో 60శాతం కంటే తక్కువ అంధత్వం ఉన్నవారికి ఈ పాఠశాలలో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది.
నేను తొమ్మిది వరకు బ్రెయిలీ లిపిలో చదువుకున్నా. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాల్లో బ్లాక్ బోర్డు మీద రాసి బోధిసే ఎలా అర్థం అవుతుంది. సాధారణ విద్యార్థులకు 45 నిమిషాల్లో క్లాస్ చెపితే అర్థం అవుతుంది
– భువన, విద్యార్థిని
మాది సూర్యాపేట. మా పాప చదువు కోసమే ఇక్కడ అంధ పాఠశాలలో చదివిస్తున్నాం. మా ఫ్యామిలీ నాలుగేండ్ల క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అ య్యాం. ఇక నుంచి ఈ పాఠశాల మూసి వేస్తే మళ్లీ ఎక్కడికి వెళ్లాలి ఎక్కడ చదివించాలి.
– సరిత, పేరెంట్
పిల్లలు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా స్టాఫ్ మాత్రం తగ్గించే పరిస్థితి ఉండటం లేదు. ప్రస్తుతం పాఠశాలలో 50 మంది మాత్రమే ఉన్నారు. కేంద్రం ఒక్కొక్కరికి నెలకు రూ.2,000 ఇస్తుంది. గతేడాది నిధులే రాలేదు.
– చొక్కారావు, డ్వాబ్ నిర్వాహకులు, నల్లగొండ