వరంగల్ చౌరస్తా, జూలై 28: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన పిట్టల వీరస్వామి (58) ఆరు నెలలుగా జీర్ణక్రియ సమస్యతో (పాంక్రియాటిక్ కార్సినోమా)తో బాధపడుతూ చికిత్స కోసం సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు.
పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈనెల 19న డాక్టర్ గోపాల్‌రావు ఆధ్వర్యంలో డాక్టర్ రమేశ్, డాక్టర్ కోటి వెంకటేశ్వర్రావు, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ నివేశ్ల వైద్య బృందం సుమారు 9గంటలు శ్రమించి విప్పుల్స్ ప్రొసీజర్ విధానం ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే అతడిని గురువారం డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్‌రావు మాట్లాడుతూ.. అత్యంత అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
లక్షల్లో ఒకరికి మాత్రమే సంక్రమించే ఈ వ్యాధి మూలంగా జీర్ణవ్యవస్థలో చాలా ఇబ్బందులు కలుగుతాయని, వ్యాధి ప్రభావమున్న అవయవంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుతం వీరస్వామి ఆరోగ్యం నిలకడగా ఉన్నదన్నారు. అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించి, ప్రాణాలు నిలిపిన వైద్యులకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.