ఉస్మానియా యూనివర్సిటీ: ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ‘తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా’ అనే కథనాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పైత్యాన్ని కథన రూపంలో ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వెయ్యి శాతం కేసీఆర్ జాగిరేనని తెలిపారు. కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చారని, ఇక్కడ ప్రతి ఇంచూ తెలంగాణ ప్రజలదేనని పేర్కొన్నారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని అభిప్రాయపడ్డారు.
‘మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త పలుకు పేరుతో పాత పైత్యాన్ని రుద్దుతున్నారు. నాడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో ఎప్పుడో చేసిన రాజ్‌భవన్ స్టింగ్ ఆపరేషన్ని ప్రసారం చేసి ఉద్యమాన్ని నీరుగార్చడానికి చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ఇంకా మరువలేదు. పది సంవత్సరాలు మంత్రిగా ఎన్నో పెట్టుబడులు తెచ్చి, యువతకు చేయూతనిచ్చి, జాతీయస్థాయిలో రాష్ర్టాన్ని నిలిపిన కేటీఆర్‌పై మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తే రాధాకృష్ణ కొత్త పలుకెందుకు మూగబోయింది.
సంవత్సరం క్రితం వైజాగ్‌లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేస్తే కనీసం ఖండించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి దినపత్రిక కార్యాలయాలపై టీడీపీ దాడులు చేస్తూ కోట్ల రూపాయల నష్టం కలిగిస్తే సాటి మీడియా సంస్థ అధిపతిగా ఆర్కే ఎడిటోరియల్ విశ్లేషణ ఏది? పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక విషబీజాలు నాటుతూ విద్వేషాలు సృష్టిస్తున్నది. ఆంధ్రజ్యోతి అంధజ్యోతిగా వ్యవహరిస్తున్నది. ఆంధ్రజ్యోతి పేరుతో ఆంధ్రాకు మాత్రమే జ్యోతి అన్నట్టు చేస్తే ఉద్యమకారులుగా ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు.
ఆంధ్రజ్యోతి పేరును తెలంగాణ జ్యోతిగా మార్చాలి’ అని దశరథ్ డిమాండ్ చేశారు. ‘ప్రాంతంవాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతిపెడదాం.. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమెర దాటేదాకా తరిమేద్దాం’ అంటూ కాళోజీ ఇచ్చిన పిలుపుతో పనిచేస్తామని హెచ్చరించారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలను తెలంగాణ ద్రోహుల మీడియా సంస్థగా భావిస్తున్నామని, వీటిని బహిష్కరిస్తున్నామని దశరథ్ వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు నిఖిల్ పటేల్, రాఘవ్, రాకేశ్, జాన్, ప్రేమ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.