చర్ల, ఆగస్టు 21 : పోలీసు ఇన్ఫార్మర్(Informer) నెపంతో ఓ మహిళా మావోయిస్టును హతమార్చిన( Maoist killed )మావోయిస్టులు ఆమె మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో బుధవారం ఉదయం వదిలి వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని బాలాజీ నగర్(అంబేద్కర్ నగర్)కు చెందిన బంటి రాధ అలియాస్ నీల్సో(34) కొన్నేళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరి చురుకుగా పనిచేస్తుండడంతో పార్టీ ఆమెకు పలు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలో ఇన్ఫార్మర్గా మారి తమ సమాచారం పోలీసులకు చేరవేస్తుందనే నెపంతో ఆమెను మావోయిస్టులు హతమార్చారు. మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నాపురం సమీపంలో వదిలి వెళ్లారు. అయితే నీల్సో మృతదేహం వద్ద ఆంధ్రా-ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో లేఖ వదిలి వెళ్లారు. విప్లవ ద్రోహి నీల్సో అని, అందుకే ఆమెను హతమార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా.. విషయం తెలుసుకున్న చర్ల సీఐ రాజువర్మ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం భద్రాచలం ఏరియా హాస్పిటల్కు పంచనామా నిమిత్తం తరలించారు.