నర్సింహులపేట/కేసముద్రం, ఏప్రిల్ 2: వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగి మట్టితో ఉన్న డబ్బా పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని నర్సింహపురం బంజర గ్రామ పంచాయతీ పరిధిలోని బయ్యా వెంకన్న వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్నారు. ఈ క్రమంలో క్రేన్ వైరు తెగి మట్టిడబ్బా బావిలో ఉన్న గుగులోత్ రవి(40)పై పడింది. రవి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని ఎస్సై సతీశ్ తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లికి చెందిన పోతకం సుధాకర్ జేసీబీతో కొత్తబావి తవ్విస్తున్నాడు. 20 ఫీట్ల లోతు తీసిన తర్వాత బండ వచ్చే అవకాశమున్నదని జేసీబీ ఆపరేటర్ చెప్పాడు. బావి లోపల పరిశీలించేందుకు పెద్దమోరి తండాకు చెందిన మరో రైతు నరేశ్‌తో కలిసి సుధాకర్ లోపలికి దిగాడు. ఈ క్రమంలో పైనుంచి భూమి కూలి లోపల ఉన్న సుధాకర్, నరేశ్‌లపై పడింది. పక్కనే ఉన్న రైతులు వచ్చి వారిద్దరిని బయటకు తీసి చికిత్స కోసం మహబూబాబాద్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వంశీధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లోతు ఎక్కువగా తీసి వెడల్పు తీయకపోవడం వల్లే ఇలా జరిగిందని రైతులు చర్చించుకుంటున్నారు.