దుండిగల్, ఆగష్టు 6 (నమస్తే తెలంగాణ): బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన మహిళ పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో ఆగ్రహానికి గురైన యువకుడు రోడ్డుపై వస్తున్న వాటర్‌ట్యాంకర్ కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన భూక్య ప్రమీల (22)కు గతంలో దినేశ్ అనే వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో దినేశ్ ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రమీల 8 నెలల క్రితం నగరానికి బతుకుదెరువు కోసం వలసవచ్చింది.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్లోని ఇందిరమ్మ కాలనీలో ఓ అద్దెగదిలో మరో ముగ్గురు స్నేహితులరాళ్లతో ఉంటున్నది. బాచుపల్లిలోని ఓ దుకాణంలో సేల్స్ ఉమన్‌గా పనిచేస్తున్నది. ప్రమీల సమీప రోడ్డుబండ తండాకు చెందిన బదావత్ తిరుపతినాయక్ కొన్ని నెలలుగా ప్రేమించుకొంటున్నారు. ఇటీవల తిరుపతికి వేరే అమ్మాయితో పెళ్లి ఖాయమైంది. ఇది తెలిసి తనను పెండ్లి చేసుకోవాలని ప్రమీల ఒత్తిడి తెచ్చింది. ఆదివారం పల్లవిని బైక్ ఎక్కించుకొని వీఎన్ఆర్ కళాశాల వద్దకు చేరగానే తిరుపతి ఆగ్రహంతో ఆమెను వాటర్‌ట్యాంకర్ కిందకు నెట్టివేశాడు. తలకు తీవ్ర గాయాలైన ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు.