బెంగళూరు, మార్చి 15: లీటర్ పాలను ఒక్క రూపాయికే విక్రయిస్తు న్న ఫ్లిప్‌కార్ట్‌పై కర్ణాటకకు చెందిన ఓ పాల సంఘం దావా వేసింది. ఇంత తక్కువ ధరకు పాలను విక్రయించటం రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమేనని ‘బెంగుళూరు మిల్క్ యూ నియన్ లిమిటెడ్’ పేర్కొన్నది. ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కి ఫిర్యా దు చేసినట్టు పాల సంఘం అధ్యక్షుడు డీకే సురేశ్ చెప్పారు.
ఇది ఎంతమాత్ర మూ న్యాయమైంది కాదని, రైతుల కష్టాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేదిగా సురేశ్ పేర్కొన్నారు. పాల అమ్మకంపై ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఆఫర్ ఈ రంగంలో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతున్నదని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు గురై.. డైరీ ఫామ్స్ నడుపుతున్న వాళ్ల ను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఈకామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ విధమైన ఆఫర్లు ప్రకటిస్తున్నదని, దీనిపై ప్రధాని మోదీకి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.