హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రుల్లో ఒకరు మృతి చెందినపుడు మరొకరితో ఉన్న పిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతల ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎంతో అవసరమని హైకోర్టు తీర్పు చెప్పింది. భార్యాభర్తల్లో ఒకరు చనిపోయిన సందర్భంలో మరొకరు మళ్లీ వివాహం చేసుకున్నప్పుడు లేదా వారు విడిపోయినప్పుడు పిల్లలను వారితో కలవకుండా చేయడం సరికాదని స్పష్టంచేసింది. పిల్లల సంక్షేమం అంటే ఆర్థిక శ్రేయస్సు మాత్రమే కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని విభిన్న కోణాలలో చూడాలని చెప్పారు. తన కుమార్తె మరణించడంతో నల్లగొండ జిల్లాలో అల్లుడి వద్ద ఉన్న తన మనుమరాలిని చూడటానికి కింది కోర్టు నిరాకరించిందని పేర్కొంటూ అమ్మమ్మ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తి మనుమరాలిని పిలిపించి మాట్లాడిన తరువాత పాప భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకున్నారు. అమ్మమ్మను కలవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అత్త, అల్లుడి మధ్య విభేదాలతో నెలకొన్న కేసు కారణంగా అమ్మమ్మకు మనుమరాలిని కలుసుకొనే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని స్పష్టం చేశారు. మనుమరాలికి అమ్మమ్మ ఆప్యాయతను దూరం చేయరాదని పేరొన్నారు. పిల్లల పెంపకం విషయంలో అవ్వ, తాతల పాత్ర ఎంతో కీలకమని గుర్తుచేశారు. తాత, అవ్వలు చెప్పే కథలు, కబుర్లు, కుటుంబ నేపథ్యం వంటి అంశాలు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయన్నారు.