Laughing Disease | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం.. నవ్వకపోవటం ఒక రోగం..అని ప్రముఖ దర్శకుడు జంధ్యాల అన్న మాటలివి. కానీ, నవ్వటమే ఒకాయన పాలిట శాపం గా మారింది. నవ్వే సర్వరోగాలకు మందు అని చెప్పే వైద్యులే ఇప్పుడు ఆయనకు చికిత్సనందిస్తున్నారు. 53 ఏండ్ల హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో టీవీ చూస్తూ ఒక్కసారిగా కుర్చిలోంచి కింద పడి స్పృహ కోల్పోయాడు. ఇంట్లోవాళ్లు గమనించి స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించి ప్రథమ చిక్సిత అందించగా, స్పృహలోకి రాలేదు.
అపోలో హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం తరలించారు. రోగిని పరీక్షించిన వైద్యులు అరుదైన నవ్వు ప్రేరిపిత మూర్ఛగా నిర్ధారించారు. మెదడుకు రక్తప్రసరణ తగ్గిపోవటంతో ఇలాంటి రుగ్మతలు వస్తాయని, జ్ఞాపకశక్తిని కోల్పోయి స్పృహ లేకుండాపోతుందని అపోలో వైద్యులు డాక్టర్ సుధీర్ తేల్చారు. మూర్ఛ వచ్చిన విషయం రోగికి గుర్తుకు ఉండదని, సకాలంలో వైద్యం అందించేలా చూడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. నవ్వు ప్రేరేపిత మూర్ఛ వ్యాధి అరుదుగా వస్తుందని పేర్కొన్నారు.