హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను సవరించి, రూల్ 3ఏ సెక్షన్‌ను చేర్చుతూ ప్రభుత్వం గత నెల 19న జారీచేసిన జీవో 33కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్మిషన్లకు విద్యార్థుల స్థానికతను రాజ్యాంగం ప్రకారంగా నిర్ణయించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. నీట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక స్థానికతను మార్చడం చెల్లదని పేర్కొన్నారు. స్థానికత వివాదంపై నిరుడు హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా జీవో 33 ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు వరుసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివి ఉండాలన్న నిబంధన వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనానికి వివరించారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరని, అలాంటివారి పిల్లలకు స్థానికతను నిరాకరించడం చెల్లదనే తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. అలాంటి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారిని స్థానిక కోటా కిందనే పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఈ వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.