చేర్యాల, జనవరి 29: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం లష్కర్ వారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ భక్తులతోపాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన 40 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు. సికింద్రాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్న పేరిట 41 రోజులపాటు చేపట్టిన సట్టీ దీక్షలను ఆలయంలో విరమించారు. మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతోపాటు అమ్మవార్లకు ఒడిబియ్యం పోశారు. గుట్టపై ఉన్న ఎల్లమ్మకు బోనం సమర్పించారు.