నీలగిరి, ఆగస్టు 9 : తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడు యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన యువతి స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నది. అదే కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న రోహిత్ ఆమెను ప్రేమిస్తున్నానని కొంతకాలంగా వెంటబడుతున్నాడు.
ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకోగా పంచాయితీ కూడా జరిగింది. మంగళవారం ఆమె తన స్నేహితురాలితో కలిసి పార్కుకు వచ్చింది. సమాచారం తెలుసుకొన్న రోహిత్ కూడా అక్కడికి వచ్చాడు. ఆమెను పక్కకు తీసుకెళ్లి కొద్దిసేపు మాట్లాడాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చిన కత్తితో ఆమెపై విచక్షణారహితంగా కడుపు, చేతులు, కాళ్లు, మోహంపై పొడిచాడు. దీంతో ఆమెకు రక్తస్రావం కాగా అక్కడి నుంచి పారిపోయాడు. సమీపంలోనే ఉన్న ఆమె స్నేహితురాలు వెంటనే పట్టణంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు వన్‌టౌన్ సీఐ గోపి తెలిపారు. కాగా సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.