హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వేల ఏండ్ల నాటి మానవ పరిణామ క్రమం, అప్పటి వాతావరణ స్థితిగతులను పక్కాగా అంచనా వేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పురాతన డీఎన్ఏ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఆధునిక మానవ జాతి కంటే ముందు ఉన్న జాతుల డీఎన్ఏను అంచనా వేసేందుకు వీలుగా ఉప్పల్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో దాదాపు రూ. 5 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని, మానవ పరిణామక్రమంపై పరిశోధనలకు కీలకంగా మారనుందని సీడీఎఫ్‌డీ డైరెక్టర్ డాక్టర్ తంగరాజన్ పేర్కొన్నారు.
సీడీఎఫ్‌డీ క్యాంపస్ పరిధిలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సేకరించిన జన్యు శాంపిళ్లపై ఇందులో పరిశోధన చేపట్టనున్నట్లు వివరించారు. ఈ ల్యాబ్ ద్వారా ఆధునిక, ప్రాచీన కాలం నాటి మానవులకు మధ్య ఉన్న జన్యు అనుబంధాన్ని గుర్తించేందుకు వీలు ఉంటుందని పేర్కొన్నారు.