Nagarkurnool | నాగర్కర్నూల్ : ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడమే నేరమైంది. ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లి పట్ల అన్న క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో చోటు చేసుకుంది.
అచ్చంపేట మండలం గుంపన్పల్లికి చెందిన అఖిల ఓ యువకుడిని ప్రేమించింది. వారం రోజుల క్రితమే ప్రేమించిన యువకుడిని పెళ్లాడింది. చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడంతో అన్న అఖిల్ రగిలిపోయాడు. మంగళవారం ఉదయం అఖిలపై అఖిల్ కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అఖిలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.