హైదరాబాద్, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా బొర్లామ్ గ్రామంలో రెండు వేల ఏండ్ల నాటి బ్రాహ్మీ లిపి ఉన్న రాతి పాత్ర లభ్యమైంది. పబ్లిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ సంస్థ (ప్రిహా)కు చెందిన డాక్టర్ శ్రీనివాసన్, బీ శంకర్రెడ్డి, చుక్కా నివేదిత శాలిని తదితరుల బృందం ఓ మట్టి దిబ్బపై లఘు శాసనంతో కూడిన రాతిపాత్రను గుర్తించింది. దీనిపై ఉన్న అక్షరాలు క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రాహ్మీలిపిలో ఉన్నాయి. ‘హిమాబుహియ’ లేక ‘హిమాబుధియ’ అనే ఐదు అక్షరాల బ్రాహ్మీ లఘు శాసనంలో ‘హిమ’ అనే పదం బౌద్ధ భిక్ఖుని (స్త్రీ)ది కావచ్చని ఈ శాసనాన్ని పరిష్కరించిన ఎపిగ్రఫిస్ట్ డాక్టర్ మునిరత్నంరెడ్డి అభిప్రాయపడుతున్నారు.
మంజీరా పరీవాహక ప్రాంతంలో దొరికిన బ్రాహ్మీ లఘు శాసనాల్లో ఇది ఆరోదని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిహా జనరల్ సెక్రటరీ డా. శీనివాసన్ పేర్కొన్నారు. బ్రాహ్మీ శాసనాలు మౌర్య, శాతవాహన కాలాలకు చెందినవని, తెలంగాణ చరిత్రను, ప్రత్యేకించి శాతవాహనుల చరిత్రను రాసే క్రమంలో ఈ ఆధారాలు ముఖ్యమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రాతిపాత్ర దొరికిన ప్రాంతం మంజీరా నదికి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. శాతవాహన కాలపునాటి ఈ రాతి పాత్ర దొరికిన స్థలం బొర్లామ్ గ్రామంలో బిచుకుందలోని కవి మడివాళ్లయ్య మఠానికి చెందిన ఆది బసవేశ్వర దేవస్థానం పక్కనే ఉన్నది. ఈ పరిశోధన మఠాధిపతి సోమాయప్ప సహకారంతో సాధ్యమైందని ప్రిహా పేర్కొంటున్నది.