జోగులాంబ గద్వాల : ఉమ్మడి రాష్ట్రంలో నర్సింగ్ విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నర్సింగ్ విద్య కు ప్రాముఖ్యత ఇచ్చారని కాళోజీ నారాయణ రావు మెడికల్ యూనివర్సిటీ బృందం సభ్యులు ప్రొఫెసర్ రాధ, జగిత్యాల నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యాలత అన్నారు.
సోమవారం జిల్లాలో వారు పర్యటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న నర్సింగ్ కళాశాలకు అవసరమైన వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 నర్సింగ్ కళాశాల లను మంజూరు చేసిందని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో త్వరలో నర్సింగ్ కళాశాల ప్రారంభానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి కళాశాల ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం కళాశాల తరగతి గదులు, వసతి గృహం, ల్యాబ్, కళాశాల నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. వారి వెంట కళాశాల ప్రిన్సిపాల్ కమల, వైస్ ప్రిన్సిపాల్ సత్యప్రియ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ తదితరులు ఉన్నారు.