ఖైరతాబాద్, అక్టోబర్ 24: ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ధ్వజమెత్తారు. సుందరీకరణ పేరుతో అడ్డుగోడలు నిర్మిస్తున్నదని విమర్శించారు. గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ 53 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ ఎన్నడూ పట్టించుకోలేదని చెప్పారు. విగ్రహానికి అడ్డంగా కట్టిన గోడను కేటీఆర్ అనుచరులు కూలగొట్టారంటూ కాంగ్రెస్ నేతలు అదనపు డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆ గోడను కూలగొట్టింది దళిత నేతలేనని చెప్పారు. దళిత నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని రాంప్రసాద్ డిమాండ్ చేశారు. లేదంటే గాంధీభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.