మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:58:50

ఇంటి నుంచే పనిచేస్తాం!

ఇంటి నుంచే పనిచేస్తాం!

  • 90%వర్క్‌ఫ్రంహోమ్‌కే మొగ్గుచూపుతున్నారు
  • ఉద్యోగులను వెంటాడుతున్న కరోనా భయం
  • కార్యాలయాల్లో రక్షణ చర్యలపై అనుమానం
  • తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వీలుకాని సంస్థలు కూడా ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వీలు కల్పించాయి. ఇప్పుడు ముప్పు తగ్గిపోతుండటంతో తిరిగి ఉద్యోగులను ఆఫీసులకు పిలుస్తున్నా యి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆలోచనపై తాజాగా ఓ స్వచ్ఛం ద సంస్థ సర్వే నిర్వహించగా ఆసక్తికర అంశాలు తెలిశాయి.  స్ట్రెట్‌ టైమ్స్‌ అనే సంస్థ వివిధ విభాగాలు, క్యాటగిరీలకు చెందిన సుమారు 1800 మంది ఉద్యోగుల అభిప్రాయాలను క్రౌడ్‌ సోర్సింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా తెలుసుకున్నది. సర్వేలో 68% ప్రైవేట్‌ ఉద్యోగులు, 20% ప్రభుత్వ ఉద్యోగులు, 12% ఇతర రంగాల వారు ఉన్నారు. చాలామంది ఇంటి నుంచి పనిచేయడానికే మొగ్గు చూపటం  గమనార్హం. ‘ఇంతకుముందు ఆఫీసులకు వెళ్లాలంటే ఇంటి నుంచి గంట ముందుగానే బయల్దేరాలి. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి మరో గంట ఆలస్యం అవుతుంది. దీని వల్ల అలసిపోయేవాళ్లం. కుటుంబ సభ్యులతో, పిల్లలతో గడిపేందుకు అంతగా సమయం దొరికేది కాదు. వారాంతపు సెలవులు  రోజువారీగా వాయిదా వేసుకుంటూ వచ్చిన పనులన్నీ చేసుకునేందుకే సరిపోయేవి. వర్క్‌ఫ్రం హోమ్‌తో కుటుంబసభ్యులతో ఎక్కువసేపు గడిపే అవకాశం లభిస్తున్నది. పిల్లలతో సంతోషంగా గడపగలుగుతు న్నాం. ప్రయాణ భారం, ఆర్థికభారం తగ్గిపోవటం ప్రశాంతతను కలిగిస్తున్నది. ఇటు ఉద్యోగబాధ్యతలను కూడా చురుగ్గా నిర్వహించగలుగుతున్నాం’ అని ఉద్యోగులు పేర్కొన్నారు.

ఇంటి నుంచి పనిచేయటం ఎంతో బాగుంది. ప్రయాణ భారం తప్పుతున్నది. శారీరకంగా, మానసికంగానూ ఉల్లాసంగా ఉంటున్నాం. పనిపై పూర్తి ఏకాగ్రతను పెట్టగలుగుతున్నాం. అదే సమయంలో కుటుంబసభ్యులతోనూ సంతోషంగా గడుపుతున్నాం. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఇంటి నుంచి పనిచేస్తేనే బాగుంటుంది.

- ఎం శ్రీకాంత్‌, గ్లోబల్‌ మొబిలిటీ మేనేజర్‌, ప్రొలిఫిక్స్‌


logo