హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఓటర్ల సవరణ/నమోదుకు సంబంధించిన ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో అత్యధిక శాతం మందికి ఎలక్టోరల్ ఫారాల (ఎన్యూమరేషన్ ఫారాలు) పంపిణీ పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం వెల్లడించింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 90.52 శాతం (3,06,21,142) ఈఎఫ్‌ల పంపిణీ పూర్తయినట్టు ప్రకటించింది. వీటి డిజిటలైజేషన్ ప్రక్రియ మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా కేవలం 7.80 శాతం (26,38,708) ఈఎఫ్‌లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని తెలిపింది. ఈ మేరకు టేబుల్‌ను విడుదల చేసింది. సీఈవో కార్యాలయం విడుదల చేసిన రాష్ట్రంలోని 33 జిల్లాల డాటాను పరిశీలిస్తే.. పంపిణీ ప్రక్రియలో కొన్ని జిల్లాలు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. నిర్మల్ (7,55,344), జోగుళాంబ గద్వాల్ (5,03,858) జిల్లాలు తమకు కేటాయించిన వంద శాతం ఈఎఫ్‌లను పంపిణీ చేసి అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధిక ఓటర్లు ఉన్న హైదరాబాద్ జిల్లాలో కేవలం 71.14%, మేడ్చల్ మలాజిగిరి జిల్లాలో 73.12% ఈఎఫ్‌లు మాత్రమే పంపిణీ అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో) ఇంటింటికీ తిరగడం లేదని, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల్లో కూర్చొని ఎన్యుమరేషన్ పత్రాలు పంచుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈఎఫ్లతో పంపిణీతోపాటు నింపిన ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ కూడా సమాంతరంగా సాగుతున్నాయి.
ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియలో జిల్లాల మధ్య భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 34.88% డిజిటలైజేషన్‌తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ (27.91%), నల్లగొండ (23.44%), ఖమ్మం (20.90%), నిజామాబాద్ (15.68%) జిల్లాలు ఉన్నాయి. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కేవలం 1.08% డిజిటలైజేషన్‌తో చివరి స్థానంలో ఉన్నది. రంగారెడ్డి (2.48%), వికారాబాద్ (2.67%), హైదరాబాద్ (2.96%) జిల్లాలు కూడా వెనుకబడి ఉన్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పటికే ఓటర్ల సహాయార్థం 16 హెల్ప్డెస్లు ప్రారంభమయ్యాయని, అవసరమైన ఇతర ప్రాంతాల్లో కూడా అదనంగా హెల్ప్డెస్లను ఏర్పాటు చేయాలని సీఈవో అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు విస్తృతంగా పర్యటించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే, ఇప్పటివరకు పూర్తయిన ఫారాలకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు వేర్వేరు కేంద్రాల్లో కాకుండా, ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫారాలను సైతం బీఎల్వోలు నిశితంగా పరిశీలించాలని, ఫారాల భర్తీపై బీఎల్వోలు, సూపర్వైజర్లకు మరోసారి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు బీఎల్వోలు తప్పనిసరిగా వారితో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, డిప్యూటీ కలెక్టర్ (ఎస్జీడీసీ) చెన్నయ్య, పీఎంఐటీ చిరంజీవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ వంద శాతం పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఈఎఫ్‌ల పంపిణీ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరముందని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల కలెక్టర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వందశాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించేందుకు సోమవారం ఆయన తన కార్యాలయంలో అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఫారాలను పకడ్బందీగా పూరించడంలో సూపర్వైజర్లు కీలకపాత్ర పోషించాలని సీఈవో సూచించారు. ఫారాలను నింపడంలో ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు స్థానిక వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో ఓటరు, బీఎల్వో సంతకాలతోపాటు ఫొటోలు కచ్చితంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం సంబంధిత సూపర్వైజర్ల ఫోన్ నంబర్లను మీడియా ద్వారా వెల్లడించాలని కలెక్టర్లను ఆదేశించారు.
