హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ): బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం రగడ తారాస్థాయికి చేరింది. బీటెక్‌లో 9వేల సీట్ల కన్వర్షన్‌కు 90 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ) కోర్సుకు సంబంధించినవే. ఈఈఈ, సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని, సీఎస్ఈలో పెంచుకునేందుకు సిద్ధపడ్డాయి. ఇందుకు జేఎన్టీయూ ఎన్వోసీ ఇవ్వగా, ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. సీట్ల కన్వర్షన్‌కు ప్రభుత్వం నో చెప్పడంతో పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏఐసీటీఈ లెక్కల్లో ఈ సీట్లు సీఎస్ఈకి మారినట్టు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమతినివ్వకపోవడంతో వాటికి గండిపడింది. ఈ సీట్లల్లో 30 శాతం యాజమాన్యకోటాలో భర్తీ చేసుకునే అవకాశం ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్వాన్స్ స్వీకరించాయి. ఆఖరున సర్కారు సీట్ల కన్వర్షన్‌కు అనుమతినివ్వకపోవడంతో మేనేజ్మెంట్ కోటా సీట్లకు గండిపడింది. దీంతో అడ్వాన్స్ తీసుకున్న వారికి సీట్లు కేటాయించని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా కొన్ని కాలేజీలు సీటు ధరను పెంచాయి. పేరుమోసిన కాలేజీల్లో సీఎస్ఈ సీటు రూ. 20 లక్షలు, మరికొన్ని కాలేజీల్లో రూ.15 లక్షలకు చేరింది. ఇబ్రహీంపట్నం సమీపంలో ఓ కాలేజీలో ముందు ఒక ఫీజు చెప్పి ఆ తర్వాత రూ.14 లక్షలు చెప్పడంతో తల్లిదండ్రులు సీటు వదులుకున్నారు. దుండిగల్‌లోని ఓ కాలేజీలో తల్లిదండ్రులు యజమాన్యంతో గొడవకు దిగారు. కాలేజీల యాజమాన్యాలకు అనుకూలంగా మంగళవారం హైకోర్టులో తీర్పురావడం కాస్త ఉపశమనంగా చెప్పవచ్చు.