హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు. తొలి విడతలో 13,965 సీట్లకు 8,982 (70%) సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఈసెట్‌లో 22,365 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో 12,757 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాగా, 12,703 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకొన్నారు. సోమవారం సీట్లను కేటాయించగా, ఇంజినీరింగ్‌లో 8,951, ఫార్మసీలో 31 చొప్పున సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 529 మంది సీట్లు దక్కించుకొన్నారు. ఇక వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైనా 3,773 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకోలేకపోయారు. సీట్లు పొందిన వారంతా ఈ నెల 21లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్టుచేయాలని సూచించారు.
నేడు పీజీఈసెట్ ఫలితాలు విడుదల
ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. కూకట్పల్లి జేఎన్టీయూలో మంగళవారం సాయంత్రం 4గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ఆర్ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేస్తారని పీజీఈసెట్ కన్వీనర్ అరుణకుమారి తెలిపారు. ఈ నెల 10 నుంచి 13 వరకు పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 22,712 మంది విద్యార్థులకు, 20,626 (90.82%) మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇంజినీరింగ్‌లో సీట్ల భర్తీ వివరాలు