ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 31: విజయానికి ఎలాంటి దగ్గరి దారులు ఉండబోవని, శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు. దీనికి ప్రత్యేక అతిథిగా హాజరైన శంతను నారా యణ్కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓయూతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నదని తెలిపారు. ఇక్కడ చదువుకొని ప్రపంచ అగ్రగామి సంస్థకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. పతి ఒక్కరూ కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తమకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించినపుడే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి సందర్భంలోనూ ఆత్మైస్థెర్యం కోల్పోకూడదని హితవు పలికారు. యూనివర్సిటీ చరిత్రలో తొలిసారిగా 1,024 మంది ప్రముఖులు పీహెచ్డీ పట్టాలు పొందారు.
ఓయూ పూర్వ విద్యార్థి శంతను నారాయణ్‌కు గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఓయూ పరిధిలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 58 మందికి బంగారు పతకాలు అందించారు. శంతను నారాయణ్ తన చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ఫ్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, డీన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.