కాచిగూడ, మార్చి 12: ప్రధానమంత్రి మోదీ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న రూ.83 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రికవరీ చేయాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ)జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు డిమాండ్ చేశారు. రికవరీ చట్టాన్ని కేంద్రం పటిష్టంగా అమలుచేయాలని కోరారు. హైదరాబాద్లోని కాచిగూడ మున్నూరు కాపు సంఘం హాల్లో ఆదివారం నిర్వహించిన కెనరా బ్యాంక్ (తెలంగాణ)ఉద్యోగుల మహాసభల్లో ఆయన మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగుల వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, బ్యాంకింగ్ రంగంలో ఉన్న రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీబీఈయూ ప్రధాన కార్యదర్శి కే శ్రీకృష్ణ, కేహెచ్ పట్నాయక్, శ్రీనివాసన్, వేణుగోపాల్, హరివర్మ, బీఎస్ మధుసూదన్, సాయిప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు.