హైదరాబాద్: హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీ (NPA)లో శిక్షణ పూర్తిచేసుకున్న 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌ను (Passing Out Parade) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి (Daljit Singh Chawdhary) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బెస్ట్ అర్చివర్స్, ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్‌లకు అవార్డులు, రివార్డులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్, టెర్రరిజాన్ని అడ్డుకోవడంలో ఐపీఎస్‌లే కీలకమన్నారు. మానవ హక్కులను కాపాడాలని, ముందున్న సవాళ్లు అధిగమించాలని సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ధనవంతులు, పేదవారిని ఒకేలా చూడాలని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌లో పోలీసు సిబ్బంది ఎంతో సహకారం అందించారని, సాయుధ దళాలతో కలిసి పనిచేశారని వెల్లడించారు. సాంకేతికత మీద మాత్రమే ఆధారపడొద్దని, క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. పోలీసు స్టేషన్ అనేది ప్రతి పౌరుడికి మొదటి నమ్మకమని చెప్పారు. ఐపీఎస్‌లుగా ఎన్నో ఒడుదొడుకులు ఉంటాయని తెలిపారు. ఆరోగ్యం, ఫిట్నెస్ కూడా చాలా ముఖ్యమని, బలంగా ఉంటేనే విధుల్లో సమగ్రంగా రాణించగలరని పేర్కొన్నారు. కొత్త చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తే ఉన్నతంగా ఉండగలరని, మీరు ఐపీఎస్‌లు మాత్రమే కాదు.. పేదలను ఆపద నుంచి కాపాడే సంరక్షకులని చెప్పారు.
కాగా, దీక్షాంత్ పరేడ్ కమాండర్‌గా తమిళనాడు క్యాడర్‌కు చెందిన అంజిత్ ఏ నాయర్ నాయకత్వం వహించారు. 77వ ఐపీఎస్ బ్యాచ్‌లో మొత్తం 174 మంది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 62 మంది మహిళలు, 112 మంది పురుషులు ఉన్నారు. వారిలో 25 ఏండ్ల లోపువారు సుమారు 21 మంది యువత ఉన్నారు. 25-28 ఏండ్ల లోపు 87మంది ఉండగా వారిలో మహిళలు 37, పురుషులు 50మంది, 28 ఏండ్లు పైబడిన వారు 66మంది ఉండగా వారిలో 18మంది మహిళలు.. 48మంది పురుషులు ఉన్నారు.
తెలంగాణకు నలుగురు..
77వ ఐపీఎస్ బ్యాచ్‌లో తెలంగాణకు 4 పోస్టులు కేటాయించారు. కాగా, వీరిలో హోం కేడర్‌కు చెందిన వారు ఎవరూ లేరు. మధ్యప్రదేశ్‌కు చెందిన అయాషా ఫాతిమా, మంధరే సోహం సునీల్(మహారాష్ట్ర), మనీషా నెహ్ర(రాజస్థాన్), రాహుల్ కాంత్(ఝార్ఖండ్)ను తెలంగాణకు నియమించారు. కాగా ఈసారి తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఐపీఎస్ చివరి వరకూ నిలిచారు. ఆ ఇద్దరిని కూడా ఇతర రాష్ర్టాలకు కేటాయించారు. వారిలో అభిజిత్ పాండేను మణిపూర్ కేడర్‌కు, ఎస్ దీప్తి చౌహాన్‌ను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు కేటాయించారు. ఈసారి అత్యధికంగా యూపీ నుంచి 35మంది ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి 19, ఢిల్లీ నుంచి 17, బిహార్ నుంచి 12, హర్యానా నుంచి 10మంది ఎంపికయ్యారు.