
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏడున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలకు రూ.74 వేలకోట్లు ఖర్చుచేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కాంగ్రెస్ పాలనతో పొల్చితే ఇది 5 రెట్లు అధికమని, అన్నిరంగాలను సమంగా అభివృద్ధిపథంలో నడిపిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలపై శుక్రవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమానికి వెచ్చించిన నిధుల పూర్తి లెక్కలను సీఎం సభ ముందుంచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి కాబట్టే పంచాయతీస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఒకే పార్టీ అధికారంలో ఉండాలని టీఆర్ఎస్ను గెలిపించారని పేర్కొన్నారు.
మీరున్నప్పుడు జేబులకెళ్లి ఇచ్చిండ్రా?
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ భయంతోనైనా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘భట్టి విక్రమార్క చాలా తెలివిగా.. మేం వేసిన పునాదుల మీదనే ఇండ్లు కడుతున్నరు అన్నట్టు మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రం ఏదైనా మంచిచేస్తే చాలా చీప్‌గా మాట్లాడుతున్నరు. మీ జేబులకెళ్లి ఇస్తున్నరా? అంటున్నరు. ఎవరైనా జేబులకెళ్లి ఇస్తరా? ప్రపంచంలో ఇదివరకు ఎవరైనా ఇచ్చిండ్రా? అమెరికాల ఇస్తరా? లండన్ల ఇస్తరా? ఎక్కడైనా ఇలా ఉంటదా? ప్రజలు కట్టే పన్నులను సమన్వయం చేసి ధర్మబద్ధంగా తిరిగి ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం తాత్కాలిక, మధ్యకాలిక, ధీర్ఘకాలిక అవసరాలకు ఎట్లా వాడుతున్నరు? ఇందుకు ఎలాంటి నైపుణ్యం, ధృక్పథం అనుసరిస్తున్నరు? అన్నది ముఖ్యం. దాన్నే ప్రజలు హర్షిస్తరు. క్రమ పద్ధతిలో మూలధన వ్యయాన్ని సమకూరుస్తున్నాం. ములధన వ్యయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1, 2 స్థానాల్లో ఉన్నది. దీర్ఘకాలిక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఐటీ, పారిశ్రామికరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం’ అని సీఎం చెప్పారు.
ఎంతపని జరిగిందన్నదే ముఖ్యం
ప్రతీ ప్రభుత్వం ఎంతో కొంత పని చేస్తుందని, కానీ ఎంత పని.. ఎంత గొప్పగా చేశామన్నదే ముఖ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ‘2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పదేండ్లలో ఎంతో చేశామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకొన్నారు. 2001లో నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన. ఉద్యమ కాలంలో, తెలంగాణ రాష్ట్రం కోసం ఎమ్మెల్యేలు పోరాడుతున్నారన్న భయంతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వలేదు’ అని సీఎం విమర్శించారు.
టాప్ టు బాటమ్ ఒకే పార్టీ
రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్కే ప్రజలు అధికారం కట్టబెట్టారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. మొదటి దఫా అసెంబ్లీ ఎన్నికల్లో తాము తక్కువ మెజార్టీతో గెలిచినప్పటికీ రెండో దఫాలో 88 అసెంబ్లీ సీట్లు గెలిచామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది గొప్ప విజయం. ప్రజలు గొప్ప తీర్పు చెప్పారు. ‘రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా పరిషత్తుల్లో టీఆర్ఎస్ నేతలే జడ్పీ చైర్పర్సన్లుగా గెలిచారు. 141 మున్సిపాలిటీల్లో 136 టీఆర్ఎస్ గెలిచింది. హైదరాబాద్‌లో మేయర్‌గా రెండుసార్లూ టీఆర్ఎస్కే అవకాశమిచ్చారు. మిగతాచోట్ల కూడా మేయర్లంతా టీఆర్ఎస్ వ్యక్తులే. పంచాయతీలు, మండలాలు కూడా మాకే అప్పజెప్పారు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలంటే టాప్ టు బాటమ్ ఒకే పార్టీ ఉండాలన్న కాంక్షతో ప్రజలు మాకు అధికారమిచ్చారు. అందుకే గ్రామాల్లో వికాసం కనపడుతున్నది’ అని సీఎం అన్నారు.