హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు అందజేస్తున్న వివిధ రకాల స్కాలర్షిప్లకు రూ.650 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పోస్ట్మెట్రిక్, నాన్ పోస్ట్మెట్రిక్, తదితర రకాల స్కాలర్షిప్లను అందజేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నాలుగో త్రైమాసికానికి సంబంధించి అన్ని రకాల స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం రూ.650,31,52,000 నిధులను విడుదల చేసింది.
స్టడీసర్కిళ్లకు రూ.4.15కోట్లు..
బీసీ స్టడీ సర్కిళ్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం రూ. 4.15కోట్లను విడుదల చేసింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన స్టడీ సర్కిళ్లకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్డెట్లో 25కోట్లను కేటాయించగా, ఇప్పటికే రూ.6.25 కోట్లను విడుదల చేసింది. తాజాగా రూ. 4.15 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.