హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సివిల్ విభాగంలో 1,180 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం జరిగిన పరీక్షకు 60 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోని 83 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,174 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 18,431 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగిన పేపర్-1 పరీక్షకు 13,405 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్-2 పరీక్షను 13,343 మంది రాశారు. పేపర్-1కు 60.44 శాతం మంది, పేపర్-2కు 60.17 శాతం మంది హాజరైనట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు.
నేడు 163 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలకు పరీక్ష
మరో 163 ఏఈఈ ఉద్యోగాలకు సోమవారం పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. జనవరి 22న ఓఎంఆర్ పద్ధతిలో అన్నింటికీ ఒకేసారి పరీక్ష నిర్వహించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షను రద్దు చేసి, కొత్త తేదీలను ప్రకటించింది. ఆన్లైన్ పరీక్షల నేపథ్యంలో 4 రోజులు పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇప్పటికే మే నెల 8, 9 తేదీల్లో 197 ఉద్యోగాలతో పాటు ఆదివారం మరో 1,180 ఏఈఈ ఉద్యోగాలకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. మిగతా ఉద్యోగాలకు సోమవారం ఈ పరీక్ష జరగనున్నది.