హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో 59 రోడ్డు ప్రాజెక్టులు నిలిచిపోయినట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యాలయం వెల్లడించింది. ఇందులో 7 ప్రాజెక్టులు ఐదేండ్లుగా పెండింగ్ ఉంటే, ఒక ప్రాజెక్టు నాలుగేండ్లు, 20 ప్రాజెక్టులు 3 ఏండ్లు, 31 ప్రాజెక్టులు ఏడాదిగా పెండింగ్ ఉన్నట్టు తెలిపారు. అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో నిలిచిపోయిన రోడ్డు ప్రాజెక్టులపై శనివారం సచివాలయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ సమీక్షించారు. అనుమతులు సాధించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అటవీ అనుమతుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియల్ను ఆదేశించారు.