హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ) : పరీక్షల్లో పుస్తకాలు పక్కనే పెట్టుకొని.. సమాధానాలను చూసి రాసుకోవడమంటే విద్యార్థులకు పండుగే. కష్టపడాల్సిన పనిలేదు.. చదువాల్సిన అవసరం అంతకన్నా లేదు.. చూస్తాం.. రాసేయొచ్చని అంతా సంబురపడతారు. అంతా ఊహించినట్టుగానే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఓపెన్‌బుక్ విధానం సత్ఫలితాలనిస్తున్నది. ఈ విధానంతో పాలిటెక్నిక్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగింది. అయితే, పుస్తకాలివ్వకుండా (క్లోజ్డ్ బుక్ విధానంలో) రాసిన వారితో పోల్చితే ఓపెన్ బుక్ విధానంలో పాసైన వారి శాతం 24 శాతం పెరుగడం విశేషం. గత 2022 నవంబర్‌లో అప్లయిడ్ ఇంజినీరింగ్ మ్యాథమేటిక్స్ సబ్జెక్టుకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. ఇందులో 59 శాతం విద్యార్థులు పాసై, 41 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇదే పేపర్‌కు 2021 ఫిబ్రవరిలో క్లోజ్డ్ బుక్ విధానంలో పరీక్ష నిర్వహించగా, కేవలం 35 శాతం విద్యార్థులు పాస్ కాగా, 65 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఎంపికచేసిన పుస్తకాలే పరీక్షా కేంద్రంలోకి అనుమతించగా వాటిని చూసి రాసిన వారు పరీక్షలను గట్టెక్కారు. అయితే, పాఠ్యాంశాలపై అవగాహన లేని వారే ఫెయిల్ అయినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఇంగ్లిష్ పేపర్‌కు ఓపెన్‌బుక్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఇలా ఏడాదికొక సబ్జెక్టు చొప్పున ఓపెన్ బుక్ విధానాన్ని విస్తరిస్తున్నారు.