వరంగల్, మే 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక సందడి మొదలైంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది. జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సోమవారంతో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ ఉప ఎన్నికపై పడింది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది మంది అభ్యర్థులు నిలిచారు. 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. లోక్‌సభ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్జెండర్లు. నియోజకవర్గ పరిధిలో 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్కు బలమైన స్థానంగా ఉంటున్నది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నికలో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయగా, 2009లో జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్ రెండోసారి విజయం సాధించారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో 2015 మార్చిలో ఎమ్మెల్సీ నియోజకర్గానికి సాధారణ ఎన్నిక జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. 2021 జరిగిన ఎమ్మెల్సీ సాధారణ ఎన్నికల్లోనూ పల్లా రెండోసారి విజయం సాధించారు. అయితే, గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది.
