హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు నిండిపోవడం, రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తవ్వడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా తీసుకొని ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు టికెట్ల ధరలను అడ్డగోలుగా పెంచి జనం జేబులను ఖాళీ చేస్తున్నారు. మరోవైపు టీజీఎస్ ఆర్టీసీ సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లెవెలుగు,ఎక్స్ సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
కానీ, ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని పేర్కొన్నది. హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రతిరోజూ 200 బస్సులు నడుపుతున్నామని, అదనంగా మరో 100 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్టు తెలిపింది. ఇదిలా ఉంటే ప్రైవేటు బస్సుల టికెట్ల ధరలు దడపుట్టిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి స్లీపర్ ఏసీ బస్సుల్లో గరిష్ఠంగా రూ.7లకు పైగా వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌కు రూ.2,300,మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 352 బస్సులు నడుపుతున్నది. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు ప్రత్యేకంగా 2,400 బస్సులను అదనపు చార్జీలు లేకుండా నడుపుతామనడంతో డిమాండ్ పెరిగింది.