అచ్చంపేట, మార్చి 15 : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి 22 రోజులైనా సహాయక చర్యలు కొలిక్కిరావడం లేదు. రోబోలను టన్నెల్లోకి పంపినా ఫలితం కనిపించడంలేదు. టీబీఎం ముందుభాగం 50 మీటర్లు డేంజర్‌జోన్‌గా గుర్తించిన నిపుణులు.. రోబోలను పంపినా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఫలితంలేకుండాపోయింది. మిషన్ ముందుభాగంలో దుర్వాసన వస్తున్నదని రెస్యూ బృందాలు చెబుతున్నాయి. టన్నెల్లోపల 13.950 కి.మీ వరకు రెస్క్యూ బృందాలు వెళ్లగా.. మిగిలిన 50 మీటర్లు బురద, మట్టి, బండరాళ్లు పేరుకుపోయాయి. క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ప్రదేశాలు డీ-1, డీ-2 ప్రదేశాలలో తవ్వకాలు జరుపుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ టన్నెల్ ఆఫీసులో సహాయ బృందాల ప్రతినిధులతో చర్యల పురోగతిని సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. లిక్విడ్ రింగ్ వ్యాక్యూమ్ పంప్, వ్యాక్యూమ్ ట్యాంక్‌తో కూడిన మిషన్ పనితీరును కలెక్టర్ పరిశీలించారు.