హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ) : బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో సంచలనం సృష్టించిన ఫైళ్ల అదృశ్య పర్వంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. శానిటేషన్ విభాగంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కనిపించకుండా పోయిన 46 కీలక ఫైళ్లు ఓ కాంట్రాక్టర్ బంధువు నివాసంలో ప్రత్యక్షమైనట్టు స్టేట్ విజిలెన్స్ విచారణలో తేలింది. ప్రభుత్వ కార్యాలయంలో భద్రంగా ఉండాల్సిన దస్త్రాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడాన్ని సీరియస్‌గా తీసుకున్న విజిలెన్స్ విభాగం సమగ్ర నివేదిక కోరింది. శానిటేషన్ విభాగానికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని బడంగ్‌పేట సర్కిల్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై కంప్యూటర్ ఆపరేటర్‌ను ఆరా తీయగా అప్పటి ఎంఎంసీ తన సంతకాలు చేసిన కొన్ని ఫైళ్లను తీసుకువెళ్లినట్టు నిర్ధారించారు.
ఏసీబీ రంగంలోకి దిగడంతో మరిన్ని అక్రమాలు ఎక్కడ బయటపడుతాయోనని భావించిన సదరు అధికారి.. వాటిని ఓ బినామీ కాంట్రాక్టర్ ఇంట్లో పెట్టడం, జీహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణలోనూ ఫైళ్ల మిస్సింగ్ ప్రస్తావన ఉన్న నేపథ్యంలో స్టేట్ విజిలెన్స్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసిన వ్యవహారంపై ఈ నెల 10న స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి మిస్సింగ్ ఫైల్స్‌పై లోతుగా విచారణ చేసి గుట్టు తేల్చారు. ఈ మేరకు ప్రస్తుత బడంగ్‌పేట సర్కిల్ అధికారులు రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి సమగ్ర నివేదిక అందజేయడం, విజిలెన్స్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశమైంది.
నివ్వెరపరిచే అక్రమాల తీరు
బడంగ్‌పేట కార్పొరేషన్లో గత రెండేండ్లుగా శానిటేషన్, చెత్త సేకరణ, సిబ్బంది హాజరు తదితర విషయాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టి ఆక్రమాలను నిగ్గుతేల్చింది. టెండర్ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు పెద్ద పనులను లక్ష లోపు చేసి చిన్నచిన్న భాగాలకు విభజించి బినామీ కాంట్రాక్టర్లతో దండుకున్నారు. ఆఫీస్ మెయింటెనెన్స్‌లో భాగంగా డైలీ న్యూస్‌పేపర్‌కు రూ.5 లక్షలు, వాటర్ బాటిళ్లు, పేపర్ ప్లేట్లు, చాయ్ బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ పేరిట లక్షలాది రూపాయల బిల్లులు డ్రా చేశారు. కార్యాలయ ఆవరణలోని చెట్లకు సున్నం వేయడానికి రూ.30లక్షలు(మూడు దఫాలుగా) బిల్లులు మంజూరు చేశారు. సెక్షన్లో అవసరమైన కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు బినామీ ఏజెన్సీలకు ప్రజాధనాన్ని దోచిపెట్టారు. బకెట్ క్లీనింగ్ మిషన్‌కు సంబంధించి నెలకు లక్షలు కేటాయించారు.
బ్లీచింగ్ పౌడర్, ఇతర శానిటేషన్ పనులు, జేసీబీ, డోజర్, ట్రాక్టర్లను ఎంగేజ్ చేసినట్టు చూపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఓడీఎఫ్, స్వచ్ఛ సర్వేక్షణ్, బతుకమ్మ, బోనాల పండుగ, తెలంగాణ వజ్రోత్సవాలు, మహానీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు.. ఇలా దోపిడీకి అంతు లేదన్నట్టు అవినీతికి పాల్పడ్డారు. మిస్సింగ్ అయిన ఫైల్స్‌లో ఎక్కువగా ఈ తరహా అక్రమాలకు సంబంధించినవి ఉండటం గమనార్హం. అయితే విజిలెన్స్ విచారణను నీరుగార్చేందుకే రికార్డులను మాయం చేశారా? లేక బిల్లుల చెల్లింపులో అధికారుల ‘లీలలు’ బయటపడకుండా జాగ్రత్త పడ్డారా? అనే కోణంలో విజిలెన్స్ విచారణ కొనసాగింది. ఇప్పటికే ఈ కార్పొరేషన్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలను గుర్తించిన జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్ కర్ణన్‌కు నివేదిక సమర్పించడంతో ఏకకాలంలో పది మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంతటితో ఆగకుండా ఏసీబీ, స్టేట్ విజిలెన్స్ రంగంలోకి దిగడం, మున్ముందు ఈ రెండు శాఖలు విచారణ జరుపుతుండటం చర్చనీయాంశమైంది. బాధ్యులపై మరిన్ని చర్యలతో పాటు పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన కాంట్రాక్ట్ సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.