IAS Transfers | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ‘మార్పు’ అంటే రాష్ట్రంలో రెండు నెలలకోసారి ఐఏఎస్‌ల పోస్టింగ్‌ల మార్పు అన్నట్టుగా మారింది. ఓచోట కుదురుకోకముందే మరోచోటుకు బదిలీ అవుతుండడంతో అక్కడైనా సరిగా ఉంటామో? లేదోనని సదరు ఉన్నతాధికారులు పాలనపై దృష్టిపెట్టలేకపోతున్నారు. గడిచిన ఏడు నెలల్లో కొందరు ఐదుసార్లు బదిలీ అయినవారుండగా, మరికొందరు సగటున రెండు నెలలకోసారి ట్రాన్స్ఫర్ అయిన అధికారులున్నారు.
కనీసం రెండేండ్లయినా ఓచోట పనిచేస్తే ఆ ప్రాంతానికి, శాఖకు ఏదైనా న్యాయం జరుగుతుందని, ఇలా నెలల్లోనే స్థానం మారితే ఇక పాలన ఎలా నడుస్తుందని అధికారవర్గాలే అసహనం వ్యక్తంచేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు తరచూ జరుగుతున్నాయి. ట్రాన్స్ఫర్ అయినవారికే మళ్లీ బదిలీలు కావడంతో ఈ వ్యవహారం పెద్ద ప్రహసనంలా మారింది.
ఏడు నెలలు.. అయిదు బదిలీలు
సమర్థ అధికారిగా పేరున్న ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ మరోసారి బదిలీ అయ్యారు. నవంబర్‌లో వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న ఆయనను పోలింగ్ సమయానికి వీఆర్‌లో పెట్టారు. డిసెంబర్లో హైదరాబాద్ సిటీ క్రైమ్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. మార్చిలో మరోసారి మల్టీజోన్-1 ఐజీగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయనను హైదరాబాద్‌లో కొత్తగా పెట్టబోయే ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అంటే గడిచిన ఏడు నెలల్లోనే ఆయనకు అయిదుసార్లు బదిలీ ఉత్తర్వులిచ్చారు. డిసెంబర్ వరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి రిజ్వీని రేవంత్ సర్కారు వచ్చాక విద్యుత్తుశాఖకు ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఆ శాఖ తమకు అతిముఖ్యమైన విభాగమని, రిజ్వీ వంటి అధికారి ఉండాలని చెప్పి అప్పుడు బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఆయనను విద్యుత్తు నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.
డిసెంబర్లో రాష్ట్ర ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కోరెం అశోక్‌రెడ్డిని రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్‌గా మార్చిలో నియమించారు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఎండీగా బదిలీ చేశారు. అంటే ఆరు నెలల్లో మూడోసారి పోస్టింగ్ మార్చారు. కరీంనగర్ కలెక్టర్‌గా మళ్లీ పమేలా సత్పతిని పంపించారు.
డిసెంబర్లో రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను, రేవంత్ సర్కారు కరీంనగర్ కలెక్టర్‌గా నియమించింది. ఆ తర్వాత వారం క్రితం బదిలీ చేసింది. మళ్లీ ఏమైందో ఇప్పుడు ఆమెనే తిరిగి కరీంనగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. టీఎస్ఐఐసీ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా రేవంత్ సర్కారు బదిలీ చేసి, ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించింది.
బీసీ వెల్ఫేర్‌కు మళ్లీ మల్లయ్యభట్టు
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లయ్యభట్టును గత మార్చిలోనే ప్రభుత్వం బదిలీ చేసింది. గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే హడావుడిగా ట్రాన్స్ఫర్ చేసింది. సమగ్ర సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు స్టేట్ డైరెక్టర్, తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. తాజాగా మల్లయ్యభట్టును పేరెంట్ డిపార్ట్‌మెంటైన బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కే వెనక్కి పంపించింది.
సీడీఏంఏ.. ఆరు నెలల్లో నలుగురు
సీడీఏంఎలను మార్చడంలో కాంగ్రెస్ సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది. మున్సిపల్ శాఖలో కీలకమైన సీడీఏంఎను పదే పదే బదిలీ చేస్తున్నది. ఆరు నెలల పాలనలోనే నలుగురు సీడీఏంఎలు వచ్చారు. మున్సిపల్ శాఖలో అత్యంత కీలకమైన కమిషనర్, డైరక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ (సీడీఏంఏ)కు కాంగ్రెస్ హయాంలో ఒక్క అధికారికీ పట్టురాకుండా పోస్టులింగ్లు ఇస్తున్నది. కీలకమైన మున్సిపల్ శాఖకు ఇప్పటికే మంత్రి లేరు.
ముఖ్యమంత్రి వద్దే శాఖ ఉన్నది. సీఎంకు మున్సిపల్, ఇతర శాఖలు, సాధారణ పరిపాలన, కీలక విషయాల్లో బిజీగా ఉండటంతో మున్సిపల్‌పై అంతగా దృష్టి పెట్టడంలేదు. ఈ శాఖలో నిత్యం సమీక్షలు, మార్గదర్శకాలు ఉంటేనే అనేక సందేహాలు వస్తుంటాయి. అలాంటి శాఖకు మంత్రి లేకపోవడం, పూర్తిస్థాయి సీడీఎంఏ లేక ఎక్కడి పనులు అక్కడే పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేనాటికి అర్వింద్ కుమార్ అదనపు బాధ్యతల్లో కొనసాగుతుండగా గత డిసెంబర్ 18న హరిచందనను సీడీఎంఏగా నియమించారు. ఆమె రెండు వారాలు మాత్రమే కొనసాగారు. ఈ ఏడాది జనవరి 2న దివ్య దేవరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలు గడువకుండానే ఆమెను సెర్ప్ సీఈవోగా బదిలీచేశారు. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలో జరిగే బదిలీల్లోనైనా పూర్తిస్థాయి సీడీఏంఏను నియమిస్తారేమోనని అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు.
ఐదు పోస్టులు ఆమెకే !
ఐఏఎస్ అధికారిణి కాట ఆమ్రపాలిరెడ్డికి రేవంత్ ప్రభుత్వం ఐదు ఉన్నతస్థాయి పోస్టులు కేటాయించింది. జీహెచ్ఎంసీ కమిషనర్, మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్, మూసీ రివర్‌ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. ఆమ్రపాలికంటే ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా, 2010 బ్యాచ్‌కు చెందిన ఆమెకు ఐదు పోస్టుల బాధ్యతలు ఇవ్వడం గమనార్హం.
1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్
2. మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్
3. మూసీ రివర్‌ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్
4. హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్
5. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్
జగన్ ఇంటిముందు నిర్మాణాలు కూల్చిన అధికారికి ప్రమోషన్
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇంటిముందు అక్రమ కట్టడాలు అంటూ కూల్చిన ఘటన వివాదాస్పదం కాగా తమకు తెలియకుండా జరిగిందని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌ను 10 రోజుల కిందట ప్రభుత్వం బదిలీచేసింది. ఇప్పుడు ఆయనకు టీఎస్ఎమ్ఎస్ఐడీసీ ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.