హైదరాబాద్, మే19 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన నిర్వహించి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులగణన నిర్వహించకుండానే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశం తేల్చకుండానే రాష్ట్రప్రభుత్వం జూన్ నెలాఖరులోనే ఎన్నికలు ఉంటాయని ప్రకటిస్తుండడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీలు, ఎంబీసీలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కులగణన చేపట్టాలని కోరారు. 42శాతం రిజర్వేషన్లను కల్పించకపోతే ఉద్యమించక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.