CCMB | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): చామనచాయ రంగుతో రెండు నుంచి నాలుగు అంగుళాల పొడవుతో 16 నుంచి 190 జతల కాళ్లతో చూడగానే గగుర్పాటు కలిగించే ఆకారంతో ఉండే పాకుడు పురుగు జెర్రి. ఈ వింత జీవి గుట్టు తేల్చడంపై సీసీఎంబీ దృష్టి సారించింది. ఈ జీవి జన్యుక్రమాన్ని అంచనా వేసి, అధ్యయం చేయడం ద్వారా జీవావరణ శాస్త్రం, పరిణామ క్రమం నియమాలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. తూర్పు, పశ్చిమ కనుమల్లో పర్యటిస్తున్న సీసీఎం పరిశోధకుల బృం దం పలు జంతుజాతులపై అధ్యయనం చేస్తున్నది. 400 మిలియన్ ఏండ్ల పరిణామం, జీవుల శరీర ఆకృతి, ఇతర భౌతిక లక్షణాలు, వాటి ఆవాసాలపై సీసీఎం బృందం అధ్యయనం చేస్తున్నది.
జాహ్నవి జోషి నేతృత్వంలోని పీహెచ్డీ స్కాలర్లు, పరిశోధకులు కేరళలోని పెప్పర వన్యప్రాణుల అభయారణ్యంలో అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్ అడవులలో వందల కాళ్లు ఉండే ఆర్థోపోడ్స్ కోసం పరిశోధిస్తున్నారు. ల్యాబ్లో అభివృద్ధి చేసిన జంతు నమూనాలకు బదులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించిన సెంటిపెడిస్ (జెర్రి), మిల్లిపెడిస్ (సహస్రపాది కీటకాలు) వంటి అకశేరుకాలపై అధ్యయనం చేస్తున్నారు. వాటి జన్యు వైవిధ్యాన్ని పరిశోధించడం ద్వారా వాటి జాతులలో అధిక జీవవైవిధ్యం ప్రాబల్యాన్ని నిర్ధారించవచ్చని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ కనుమలలో పర్యటిస్తున్న తమ బృందం సెంటిపెడిస్లను సంగ్రహించి వాటిని పెట్టెల్లో నిల్వ చేసి సీసీఎంబీకి తరలించనున్నారు.