హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 362 కేసులు నమోదు చేసినట్టు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.453 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులను సీజ్ చేశామని, ఇందులో రూ.362 కోట్ల నగదు, 71 వేల ఫోన్లు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను పంపించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారమిచ్చిందని తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా అడిషనల్ సీఈవో లోకేశ్‌కుమార్, అదనపు సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. ఆదివారం మినహా మిగిలిన వారాల్లో నామినేషన్లను ఆయా రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. నామినేషన్ డిపాజిట్ మొత్తాన్ని నగదు లేదా చలాన్ రూపంలో మాత్రమే స్వీకరిస్తారని స్పష్టంచేశారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు కొత్తగా జీరో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆర్వోకు ఇవ్వాలని సూచించారు. నామినేషన్ వేయడానికి ఆర్వో కార్యాలయ పరిధిలోకి ఒక అభ్యర్థికి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అభ్యర్థితో పాటుగా మరో ఐదుగురిని లోపలికి అనుమతిస్తారని చెప్పారు. అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు సెట్ల నామినేషన్లు వేయవచ్చని ఒకసారి మాత్రమే డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు.
10 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటు నమోదు, తొలగింపు, సవరణల కోసం 59 లక్షల దరఖాస్తులు, ఇందులో కొత్తగా ఓటు హక్కు కోసం 33 లక్షల దరఖాస్తులు వచ్చాయని వికాస్‌రాజ్ వెల్లడించారు. ఈ నెల 10 కల్లా దరఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆ తరువాత ఓటరు జాబితాను రూపొందిస్తామని తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీని ఈ నెల 10 తరువాత ప్రారంభిస్తామని, పంపిణీ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉండొచ్చని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఓటర్లు పెరగడంతో 289 పోలింగ్ కేంద్రాల్లో 1,500 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, ఇక్కడ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. దివ్యాంగులకు వీల్‌చైర్ సదుపాయం కల్పించడానికి 18 వేల వీల్చైర్లను కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. దివ్యాంగులు ఓటు వేయడానికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని, అయితే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.21 కోట్లకు చేరిందని, ఇందులో ఓవర్సీస్ ఓటర్లు 2,859 మంది ఉన్నారని వివరించారు. రాష్ట్రంలో 18-19 ఏండ్ల వయసు ఓటర్లు 9.10 లక్షలకు చేరారని చెప్పారు.
నగదుకు ఆధారాలు వెంట తీసుకెళ్లాలి
నగదు, నగలు పట్టుకున్న సందర్భంలో రాజకీయ పార్టీలకు సంబంధంలేకుంటే వాటిని వెంటనే ఇవ్వాలని జిల్లా గ్రీవెన్స్ కమిటీలకు సూచించామని వికాస్‌రాజ్ వెల్లడించారు. ప్రజలు ఆధారాలను వెంట తీసుకెళ్లాలని చెప్పారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘనలపై 362 కేసులు, 256 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 205 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నియామవళి ఉల్లంఘనలపై రాజకీయ పార్టీలపైనే 137 కేసులు నమోదు అయ్యాయని, బీఆర్ఎస్పై 13, బీజేపీపై 5, కాంగ్రెస్‌పై 16, బీఎస్పీపై మూడు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. ఉల్లంఘనలపై ప్రగతిభవన్‌కు నోటిసులు జారీ అయ్యాయని, వివరణను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని చెప్పారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడి గురించి పోలీసుల నుంచి నివేదిక వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో 106 నియోజకవర్గాల్లో నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుందని చెప్పారు.
ఇప్పటివరకు సీజ్ చేసిన వస్తువుల వివరాలు