హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): అంతరిక్ష పర్యాటకానికి త్వరలో హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్నది. దీనిలో భాగంగా ఈ నెల 7న స్పెయిన్‌కు చెందిన హాలో స్పేస్ టూరిజం కంపెనీతో కలిసి నిర్వహించిన భారీ ప్లాస్టిక్ బెలూన్ ప్రయోగం విజయవంతమైనట్టు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌లోని తమ కేంద్రంలో యూనివర్సిటీ నిపుణులు రూపొందించిన ఈ బెలూన్ భూమికి 36.9 కి.మీ. ఎత్తులో విజయవంతంగా సంచరించి దిగ్విజయంగా తిరిగివచ్చినట్టు వెల్లడించింది. బెలూన్ల తయారీతోపాటు వాటిని నింగిలోకి పంపడంలో హాలో స్పేస్‌కు టీఐఎఫ్ఆర్ బెలూన్ కేంద్రం సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నది.
భూమి నుంచి ఒకేసారి 6-8 మందిని నింగిలోని స్ట్రాటో ఆవరణ వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు టీఐఎఫ్ఆర్ తెలిపింది. ఈ ప్రయోగంలో భాగంగా 2.87 లక్షల క్యూబిక్ మీటర్ల పరిమాణం కలిగిన ప్లాస్టిక్ బెలూన్ను దాదాపు 620 కిలోల బరువైన మానవరహిత క్యాప్సూల్‌తో నింగిలోకి పంపినట్టు పేర్కొన్నది. ఈ ప్రయోగం జరిగిన 155 నిమిషాల తర్వాత బెలూన్ నింగిలో 36.9 కి.మీ. ఎత్తుకు చేరుకొని 40 నిమిషాలపాటు అక్కడే సంచరించిందని, అనంతరం భూమికి తిరుగు పయనమై వికారాబాద్ జిల్లా మొగిలిగుండ్ల గ్రామానికి సమీపంలోని ఖాళీ స్థలంలో సురక్షితంగా దిగిందని వివరించింది. భూమిపై బెలూన్ ల్యాండ్ అయిన తర్వాత క్యాప్సూల్‌ను విడదీసి తమ బెలూన్ కేంద్రానికి తీసుకెళ్లినట్టు తెలిపింది.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా (ఏఏఐ), శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు టీఐఎఫ్ఆర్ పేర్కొన్నది.
2029 నాటికి వాణిజ్య సేవలు, టికెట్ ధర 1.64 కోట్లు
టీఐఎఫ్‌ఆర్‌తో కలిసి ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న హాలో స్పేస్ సంస్థ 2016లో ఏర్పాటైంది. 2029 నాటికి స్పెయిన్‌తోపాటు వివిధ దేశాల నుంచి బెలూన్ ఫ్లైట్ సేవలను ప్రారంభించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ఉద్గారాలను విడుదల చేయని ఈ బెలూన్ ఫ్లైట్ల ద్వా రా నింగిలోకి వెళ్లేవారు గరిష్ఠంగా 40 కి.మీ. ఎత్తు నుంచి భూగోళం అందాలను ఆస్వాదించవచ్చని, అందుకు టికెట్ ధరను రూ.1.64 కోట్లుగా నిర్ణయించామని ‘హాలో స్పేస్’ తెలిపింది.