హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పనిచేయలేం. మమ్మల్ని మా సొంత రాష్ర్టానికి పంపండి అని వేడుకుంటున్న ఏపీ స్థానికత గల ఉద్యోగులను పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. మరోవైపు ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి రప్పించింది. ఇటీవలే రేవంత్‌రెడ్డి సర్కారు 122 మంది గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు రప్పించింది. అయితే ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేసే ఫైల్ మాత్రం ప్రభుత్వం వద్దే పెండింగ్‌లో ఉంది. ఈ అంశంపై పలుమార్లు తెలంగాణలోని ఏపీ ఉద్యోగులు ప్రభుత్వ పెద్దలను కలిసి వినితిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని తమను ఏపీకి పంపించాలని నాన్‌లోకల్ టీచర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు మోహన్‌రావు డిమాండ్ చేశారు.
1,369 మంది ఉద్యోగులు
రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే బదిలీచేశారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులను బదిలీ చేయలేదు. దీంతో ఒక రాష్ట్రం ఉద్యోగులు మరో రాష్ట్రంలో ఉండిపోయారు. ఏపీకి బదిలీ కావాలనుకొనే వారి నుంచి దరఖాస్తులు కోరగా.. 1,369 మంది ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీలోను ఈ అంశం చర్చకు వచ్చింది. ఏపీ నుంచి వచ్చేవారికి గ్రీన్ సిగ్నల్నిచ్చిన రేవంత్సర్కారు.. ఏపీకి వెళతామన్న వారిని పంపించేందుకు మాత్రం వెనుకాడుతున్నది. గత పదేండ్లల్లో 2,300 మంది ఉద్యోగులను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీచేశారు. కానీ ఒక్క ఏపీ ఉద్యోగిని కూడా సొంత రాష్ర్టానికి పంపించలేదు.
వచ్చిన వారే తప్ప.. ఏపీకి వెళ్లినవారే లేరు.