హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన (DDU-GKY)కి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఈ పథకం కింద గత రెండేండ్లలో 15 వేల మందికిపైగా యువతకు శిక్షణ అందించినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి రూ.35 కోట్లు స్వాహా చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో 2,800 మందికి శిక్షణ పేరుతో మరో రూ.37 కోట్లు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. 2025-26 సంవత్సరంలో ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్లకు ఈ నెల 18 వరకు గడువు ఉన్నప్పటికీ గతంలో ఎంపికైన ఏజెన్సీలకే మళ్లీ కాంట్రాక్టు కట్టబెట్టాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. పరిశ్రమల అవసరాలు, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ వృత్తుల్లో గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లో నియమించాలన్న మహోన్నత ఆశయంతో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2014 సెప్టెంబర్‌లో డీడీయూ-జీకేవై పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద గ్రామీణ పేద యువతకు శిక్షణ ఇచ్చి వారికి నెలనెలా వేతనం అందే స్థిరమైన ఉపాధిని కల్పించాల్సి ఉన్నది. అందుకోసం అర్హత గల ఏజెన్సీలను ఎంపికచేసి, వాటి ఆధ్వర్యంలో యువతకు శిక్షణ ఇస్తారు. డీడీయూ-జీకేవై కింద రాష్ర్టానికి రూ.133 కోట్లు కేటాయించగా.. ఇప్పటివరకు 85 వేల మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించినట్టు అధికారులు చెప్తున్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఇంకా రూ.37 కోట్ల వరకు ఖర్చుచేసి మరో 2,800 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్ల దాఖలుకు ఈ నెల 18 వరకు గడువు ఉన్నప్పటికీ అధికారులు గతంలో ఎంపిక చేసిన ఏజెన్సీలకే కాంట్రాక్టు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.
సహజంగా ఏజెన్సీల ఎంపికకు ప్రాజెక్టు అప్రూవల్ కమిటీ (పీఏసీ) ఉంటుంది. అందులో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, టీఎస్ఎస్డీఎం, మెప్మా మిషన్ డైరెక్టర్లతోపాటు ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. టెండర్లకు గడువు ఉన్నప్పటికీ ఈ నెల 13నే ప్రాజెక్టు అప్రూవల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పీఏసీ సభ్యులకు గ్రామీణాభివృద్ధి శాఖ సీఈవో సర్కులర్ జారీచేశారు. దీంతో కాంట్రాక్టు కట్టబెట్టాల్సిన ఏజెన్సీలకు ఆమోదం తెలిపేందుకే పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఏజెన్సీల ఎంపిక ఇప్పటికే పూర్తయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్ల ద్వారా దశలవారీగా ఏజెన్సీలను ఎంపిక చేస్తున్న అధికారులు.. తమకు ఇష్టమొచ్చిన ఏజెన్సీలకు కాంట్రాక్టులను అప్పగించడం అలవాటుగా మారింది. 100కుపైగా ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం 20 ఏజెన్సీలనే ఎంపికచేసి, వారికే కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలిసింది. మిగిలిన ఏజెన్సీలకు అర్హతలు ఉన్నప్పటికీ వివిధ రకాల సాకులతో వాటిని తిరస్కరించినట్టు సమాచారం.
ఆరంభంలో సజావుగానే సాగిన డీడీయూ-జీకేవై.. మధ్యలో కొవిడ్ వల్ల కొంతకాలం నిలిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత రెండేండ్లలో 15 వేల మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించారన్న ఆరోపణలున్నాయి. శిక్షణ పొందిన అభ్యర్థుల వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతున్నది. వాస్తవానికి డీడీయూ-జీకేవై కింద గ్రామీం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిని ఉద్యోగాల్లో నియమించాల్సిన బాధ్యత కూడా ఏజెన్సీలపైనే ఉన్నది. కానీ, ఇప్పటి వరకు 85 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు చెప్తున్న అధికారులు.. ఆ యువతకు ఎక్కడ ఉద్యోగాలు కల్పించారో వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.
డీడీయు-జీకేవై ఏజెన్సీల ఎంపికకు సంబంధించిన వివరాలు తనవద్ద లేవని గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ సీఈవో శ్రీజన తెలిపారు. తాను కొత్తగా ఈ బాధ్యతలు చేపట్టినట్లు ఆమె చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు సమయం దగ్గరపడినందున గతంలో ఎంపిక చేసిన ఏజెన్సీల గడువు పొడిగించాలని నిర్ణయించినట్టు ఈడీ కృష్ణన్ వెల్లడించారు. అర్హతల ఆధారంగానే గతంలో ఏజెన్సీలను ఎంపిక చేశామని, అందుకే మళ్లీ వారికే కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కానీ, గత రెండేండ్లలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులు, వారు ఉద్యోగాలు చేస్తున్న కంపెనీల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
సహజంగా ప్రభుత్వం అమలుచేసే ఏ పథకానికైనా సమగ్ర ఆడిట్ ఉంటుంది. కానీ గ్రామీణ పేద యువతకు ఉద్దేశించిన డీడీయూ-జీకేవైపై ఇంతవరకు ఎటువంటి ఆడిట్ లేదు. ఎంత మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చారు?, వారు ఎక్కడెక్కడ ఉపాధి పొందుతున్నారనే సమాచారం అధికారుల వద్ద అందుబాటులో లేదు. శిక్షణ బాధ్యతలు అప్పగించిన ఏజెన్సీల్లో చాలావాటికి సరైన అర్హతలు లేకపోయినప్పటికీ తప్పుడు ధ్రువపత్రాలతో ఎంప్యానల్ అయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర నిధులతో అమలవుతున్న ఈ పథకంపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తూతూమంత్రంగా సాగుతున్నది. ఏజెన్సీలే తమ ఇష్టారాజ్యంగా అభ్యర్థుల జాబితా తయారుచేసి, వారికి శిక్షణనిచ్చినట్టు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. వారితో అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా నిధులు విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత ఆ నిధులను చెరిసగం పంచుకుంటున్నట్టు వినికిడి. ఆడిట్‌పై అధికారులను ప్రశ్నించగా.. మాట్లాడేందుకు వారు నిరాకరించారు.