Congestion for Police Jobs | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల్లోనే పోలీసు ఉద్యోగాల కోసం 32 వేల దరఖాస్తులు వచ్చాయి. సోమవారం నుంచి పోలీసు ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లో వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల రెండో తేదీ (సోమవారం) నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. రెండు రోజుల్లోనే అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 రాత్రి పది గంటల వరకు గడువు ఉంది.
అయితే, చివరి రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ముందు నుంచే దరఖాస్తు చేసుకోవడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. గతానికి భిన్నంగా తొలి రెండు రోజుల్లోనే 32 వేల దరఖాస్తులు చేరడం పోలీసు ఉద్యోగాల పట్ల అభ్యర్థుల్లో నెలకొన్న పోటీకి నిదర్శనంగా కనిపిస్తున్నది. దరఖాస్తు చేస్తున్న అభ్యర్థుల నుంచి రద్దీకి తగినట్లు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్ఎల్పీఆర్బీ అన్ని ఏర్పాట్లు చేసింది.