కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 5: ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ – దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమయ్యారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ – కోబ్రా, ఎస్టీవో బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా నారాయణ్‌పూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండూర్ – తులతులీ గ్రామల మధ్య గల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. మృతులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 6వ కంపెనీ, తూర్పు బస్తర్ డివిజన్‌కి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో రూ.25 లక్షల రివార్డున్న దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు, తూర్పు బస్తర్ డివిజన్ ఇన్చార్జి నీతి అలియాస్ ఊర్మిలతో పాటు డివిజినల్ కమిటీ సభ్యులు సురేశ్ సలాం, మీనా మడకం ఉన్నారు. ఇప్పటివరకు గుర్తించిన మృతులపై రూ.1.30 కోట్ల రివార్డు ఉంది.
మృతుల ఫొటోలు బయటపెట్టాలని డిమాండ్
ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు ముఖ్య నేతలు నంబాల కేశవరావు, తక్కెళ్లపాడు వాసుదేవరావు ఉన్నారనే సమాచారం అందుతున్నట్టు పౌరహక్కుల సంఘల నేతలు తెలిపారు. పోలీసులు వెంటనే మరణించిన మావోయిస్టుల పేర్లు, ఫొటోలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ హైదర్‌గూడలో మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టు ఆశన్న మృతి చెందినట్టు పుకార్లు
ములుగు జిల్లా వెంకటాపూర్ మం డలం నర్సింగాపూర్‌కు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు సోషల్ మీడియాలో వైరల్ ఆవుతున్నది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టులు మృతి చెందగా, అందులో ఆశన్న ఉన్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. ఈ విషయమై ఎస్సై జక్కుల సతీశ్‌ను వివరణ కోరగా.. ఆశన్న మృ తిచెందిన విషయం శనివారం రాత్రి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఆశన్న.. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసులో ఆశన్న ప్రధాన నిందితుడని, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు, మాజీ సీఎం జనార్దరెడ్డిలపై జరిగిన దాడుల్లో ప్రధాన పాత్ర వహించినట్టు గతంలో పోలీసులు ప్రకటించారు.