బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమ దాట్ల వెల్లడి
హైదరాబాద్, మార్చి 16 : తమ సంస్థ నెలకు పది కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల తయారీ సామర్థ్యాన్ని సాధించిందని బయోలాజికల్-ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల పేర్కొన్నారు. ప్రస్తుతం తమ వద్ద 12-15 ఏండ్లలోపు పిల్లలకు వేసే కార్బివ్యాక్స్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్ల వరకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న అవసరాలు, డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. సంవత్సరానికి వంద కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం తమకు ఉందని తెలిపారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిమా దాట్ల పాల్గొన్నారు. దేశమంతా అత్యంత ఆతృతతో ఎగురుచూస్తున్న 12-15 సంవత్సరాలలోపు పిల్లల వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పిల్లలపై తమ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని, తల్లిదండ్రుల ఆందోళనను తగ్గిస్తుందని చెప్పారు. కొవిడ్ వైరస్ తక్కువ సమయంలోనే అనేక మ్యుటేషన్లకు గురైందని అంటూ.. కార్బివ్యాక్స్ రోగ నిరోధక ప్రతిస్పందన ఆ వైరస్‌ను నియంత్రించడమే కాకుండా బీటా, డెల్టా, ఒమిక్రాన్ తదితర వేరియంట్లను కూడా నిర్వీర్యం చేసినట్టు క్లినికల్ ట్రయల్స్‌లో వెల్లడైందని చెప్పారు. సరసమైన ధరకు ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా సమాజానికి తమవంతు సహకారం అందిస్తున్నామని, ఇందులో భాగంగా కొవిడ్-19వ్యాక్సిన్‌ను ప్రైవేట్ మార్కెట్లో రూ. 990కే అందుబాటులోకి తెచ్చామని మహిమ వివరించారు.