Gadwal Court | గద్వాల అర్బన్, అక్టోబర్ 22: బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన కోర్టు అధికారులే అవినీతికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల కోర్టులో చోటుచేసుకున్నది. వ్యవహారమంతా న్యా య అధికారి విచారణలో ఆలస్యంగా వెలుగుచూసింది. గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతోపాటు జూరాల హైడల్ ప్రాజెక్ట్‌లో భూ ములు కోల్పోయిన బాధితుల పేరుపై కొందరు కోర్టు అధికారులు, న్యాయవాదులు పరిహారాన్ని మరోసారి క్లెయిం చేసేందుకు ప్రయత్నించారు. పరిహారం తీసుకునే బాధితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టే సమయంలో ఓ న్యాయాధికారి అనుమానం వ్యక్తంచేశారు. దీంతో సమగ్ర విచారణకు ఆదేశించగా.. వివరాలు సేకరించారు. 2016 నుం చి 2021 వరకు ముంపు భూముల పరిహారానికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించినట్టు తెలిసింది.
బాధితులను ఆసరాగా చేసుకొని రూ.3.08 కోట్లకుపైగా స్వాహా చేసినట్టు వెల్లడైంది. కోర్టులో విధులు నిర్వహించే ఓ అధికారి హస్తం ఇందులో ఉన్నట్టు తేలింది. క్లెయిమైన చెక్కులను అధికారి తన భార్య ఖాతాలో బ్యాంక్ అధికారుల సహకారంతో జమ చేసినట్టు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి పూర్తి ఆధారాలు సమర్పించినట్టు తెలిసింది. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో కోర్టు అధికారి, అతడి భార్యపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో న్యాయవాదులతోపాటు కొందరు రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగాన్ని బయట పెట్టిన న్యాయాధికారిని కొందరు రాజకీయ నాయకులు, కోర్టు అధికారులు, న్యాయవాదులు బదిలీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. టౌన్ ఎస్సై కల్యాణ్‌ను వివరాణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు.