హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలోని పెదవాగు ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతుల కోసం దాదాపు రూ.3.5కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఏపీతోపాటు జీఆర్ఎంబీకి నివేదించారు. ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)చైర్మన్ ముకేశ్‌కుమార్ సిన్హా జలసౌధలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు వాటిల్లిన నష్టం, పునరుద్ధరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టుకు వాటిల్లిన నష్టాన్ని తెలంగాణ, ఏపీ అధికారులు జీఆర్ఎంబీకి వివరించారు. జీఆర్ఎంబీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిన నేపథ్యంలో హైడ్రాలజీ అధ్యయనం చేయించాలని, ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతుల కోసం ఇరు రాష్ర్టాలు అంచనాలు రూపొందించాలని, డ్యామ్ సేఫ్టీ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు కాల్వల పునరుద్ధరణ పనులను ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. సమావేశంలో బోర్డు సెక్రటరీ(టెక్నికల్)కనోడియా, ఎస్ఈ ప్రసాద్, తెలంగాణ నుంచి ప్రాజెక్టు ఈఈ సురేశ్, ఏపీ ఏలూరు ఎస్ఈ దేవప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.